రాతియుగం నుండి మానవుడు శక్తిని ఆరాధిస్తూ వస్తున్నాడు. నాగరికత అభివృద్ధి చెందని సమయాలలో విగ్రహారాధన లేదు. చెట్టునో పుట్టనో శిలనో దేవతగా భావించి ఆరాధించేవారు. క్రమేణా ఆ ప్రకృతి నుండి తయారు చేసుకునే వస్తువులలో ఆయా దైవాన్ని ఆరాధించడం కొనసాగింది. ఆ పరంపరలో మొదలైనదే ఈ కుండ పూజ.
కుండ అంటే ధరించునది . ఈ సందర్భములో తీసుకున్నట్లైతే కుండ అంటే అండముని ధరించునది అదే మాతృ మూర్తి గర్భం. జగత్తుని ప్రసవించునట్టి ఆ విశ్వ యోనియే పూజ్యనీయమైనది. దానికి మరొక రూపమే ఈ కుండ. కు అనే అక్షరం పృథవీ తత్వముని సూచిస్తుంది . ఇంతక ముందు చెప్పుకునట్లు భూమాత ప్రత్యుత్పత్తికి చిహ్నం. కావున ఆ భూ దేవికి ఒక సగుణ రూపము రూపం ఇచ్చినట్లయితే కుండ అవుతుంది. అందుకే ఏ శక్తి రూపమైనా, గ్రామ దేవత ఐన , ఇంటి దేవర అయినా అనాది నుండి వారిని కుండ రూపంలో పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక అమ్మవారి జాతరలలో పుట్టింటి సారె అని కుమ్మరి ఇంటి నుండి ఆరణి లేదా సారె తీసుకువస్తారు అవి ఇప్పటివలే లోహముతో చేసినవి కాక మట్టితో చేసిన ముంతలుగా ఉంటాయి ఏవ్ అమ్మవారికి ప్రీతీ అని నమ్మకం.
తిరువేర్కాడు మారెమ్మవారి చరిత్రలో ఈ విధంగా చెప్పబడినది. త్రిమ్మోర్థులు విశ్వ వ్యాప్తమైన ఆ జగజ్జనిని పూజకి సులువుగా ఒక రూపము దాల్చమని ప్రార్ధించగా ఆవిడ కుండగా మారి అందులోని నీటిలో తేలియాడే ఏడు రెమ్మల వేపాకులా మారిందంట. అందుకే ఆవిడని అక్కడ కుండ మారి అని పిలుస్తారు. గ్రామ దేవత ఐన ఎల్లమ్మ లేదా జగదంబకు సర్పములతో అలంకరించబడిన కుండగా భావిస్తారు. ఆ సర్పాలు ఆ విశ్వ యోనిని ఆశ్రయించిన వీర్య శక్తికి ప్రతిరూపము. అంటే ఆ మొత్తం కూడా జగత్ సృష్టిని ప్రతిబింబిస్తుంది . అందుకే ఆవిడ ఎల్లరకు అమ్మ ఎల్లమ్మ ఐనది. పోలేరమ్మని కుండజా అని పిలుస్తారు అంటే ఆవిడ కుండలో జన్మించినది అని. అందుకే వేంకటగిరి సంస్థానంలోని పోలేరమ్మ పుట్టిన ఇల్లు కుమ్మరి ఇల్లుగా భావిస్తారు.ఇలా మనవడు నాగరికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇటువంటి రహస్యాలను మిళితం చేసుకొని దైవ ఆరాధనా కోనసాగిస్తూ వస్తున్నాడు.

0 comments:
Post a Comment