అలవైకుంఠపురిలో ఆమూలాగ్రమున కూర్చున్న భక్తపక్షపాతి అయిన వైకుంఠవాసుడు తన భక్తులను ఆదుకోవడానికి, వారికి మోక్షసిద్ధిని ప్రసాదించడానికి భువికి దిగిరావడం చాలాసార్లు జరిగింది. అలా తన భక్తితో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ్ని కట్టిపడేసిన మహాభక్తుడు భక్తపుండరీకుడు. శ్రీహరినే మెప్పించడంవల్ల ఆ భక్తుడి పేరుమీదే వెలిశాడు. నేడు మహారాష్టల్రోని అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రాలలో ‘పండరీపురం’ ఒకటి.
పుండరీకుడు పాండురంగ విఠలునిగా చెప్పుకునే శ్రీహరిని మెప్పించిన మహా మహిమాన్విత తీర్థరాజమిది. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం, పురాణేతిహాసాలలో ప్రముఖమైన పాండురంగ విఠలుని దివ్యధామంగా వర్ణించబడింది. మహారాష్టల్రోని షోలాపూర్ జిల్లాలో ఉన్న ‘పండరీపురం’ ఒకప్పుడు చిన్ని గ్రామం. చంద్రబాగా నదిని భీమా నది అని కూడా పిల్వడం జరుగుతోంది.
రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుని పండరీపురం పాండురంగ విఠలుని మందిరం విశిష్టత గొప్పది. అత్యంత మహిమా సమన్వితమైన, తేజోవిరాజమైన పాండురంగ విఠలుని మందిరం శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయం ఏ కాలంనాటిదని చెప్పడానికి ఇతమిత్థమైన ఆధారాలు లేకపోయినప్పటికీ, 12-13శతాబ్దాల కాలంనుంచే ఈ ఆలయానికి చెందిన ఉనికి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ ఆలయంలో ఉన్న విఠలుని మూలమూర్తి అంతకన్నా ప్రాచీనమైనదని చెబుతారు.
అత్యంత మహిమాన్వోపేతమైన పండరీపురం శ్రీ పాండురంగస్వామి (విఠలుని) ఆలయం నిరంతరం భక్తజనంతో అందంగా, ఆహ్లాదంగా, ఆధ్యాత్మిక సుగంధ పుష్పంలా దర్శనమిస్తుంది. ఇక్కడ పాండురంగడు అవతరించడం వెనుక పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది.
పురాణగాథ
పుండరీకుడనేవాడు దుర్వ్యసనాపరుడు. కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తూ జులాయిగా తిరిగేవాడు ఇహ భోగాలకు మోహితుడైన పుండరీకుడు, విష్ణ్భుక్తులైన తల్లిదండ్రుల్ని, భార్యను సైతం నిర్లక్ష్యం చేశాడు. పుండరీకుని ఆగడాలను భరించలేని అతని తల్లిదండ్రులు, తమ కొడుకును మార్చమని ఆ శ్రీహరిని వేడుకున్నారు. వేశ్యలోలుడైన పుండరీకునికి చేదు అనుభవాలు అతనికి జీవిత పాఠాన్ని నేర్పాయి. భక్తి ఒక్కటే శాశ్వతమైనదని అతడు గ్రహించాడు. భగవంతుని చేరుకోవడానికి భక్తికి మించిన మరో మార్గంలేదని గ్రహించి, ఆనాటి నుంచి శ్రీహరిని సేవించడం మొదలుపెట్టాడు. అహోరాత్రాలు ఆహార పానీయాలు మాని పశ్చాత్తాప హృదయంతో తన తల్లిదండ్రులకు సేవచేశాడు. తన భక్తుడైన పుండరీకుడ్ని పాండురంగడు పరీక్షించదలచి, పుండరీకుడి దగ్గరకు వచ్చి, తాను వచ్చానని చెప్పాడట.
ఆ సమయంలో పుండరీకుడు మాతాపితల సేవల నిమగ్నమయ్యాడట. మాధవసేవకు మించినది మాతాపితల సేవ అని గ్రహించిన అతడు, తాను మాతాపితల సేవలో ఉన్నానని, ఒక ఇటుక విసిరి, ఆ ఇటుక పడిన చోట నిరీక్షించమని పాండురంగడికి చెప్పాడట. అంతట శ్రీహరి ఆ ఇటుక పడిన చోటే శిలారూపుడై పోయాడట. శ్రీహరి పాండురంగడిగా అలా శిలారూపుడైపోయిన పుణ్యప్రదేశమే పండరీపురం.
అలాగే ఇక్కడ శ్రీహరి వెల్వడం వెనుక మరో పురాణగాథ కూడా ప్రచారంలో ఉంది. శ్రీహరి తన లీలా వినోదంలో భాగంగా, రుక్మిణి మాత ఎదురుగానే, తన ప్రేయసితో ఏకాంతంగా గడిపాడట. ఇది కంటపడిన రుక్మిణీ మాత సహించలేక పోయిందట. ఆ తల్లి స్వామిమీద కోపగించుకుని తులసీవనంగా పిలువబడే పండరీపురానికి వచ్చి ఘోర తపస్సు చేసిందట. భార్యను వెతుక్కుంటూ శ్రీకృష్ణ్భగవానుడు కూడా ఈ క్షేత్రానికి వచ్చి పుండరీకుడ్ని అనుగ్రహించాడట.
ప్రధానాలయానికి ముందుద్వారం మధ్య భాగంలో భక్తాగ్రేసరుడు నామ్‌దేవ్ మహరాజ్ సుందరిమూర్తి ఒకటి ఉంది. పండరీపురం పాండురంగస్వామి వారి దర్శనంకోసం వచ్చే భక్తులు ముందుగా నామ్‌దేవ్ మహరాజ్ వారి మూర్తిని దర్శించుకుంటేనే పాండురంగస్వామి వారిని దర్శించుకున్న ఫలం దక్కుతుందని చెబుతారు. ఈ మూర్తికి సమీపంలో నామ్‌దేవ్‌మహరాజ్ మెట్లు దర్శనమిస్తాయి. ఉత్సవాలపుడు భక్తులు ఈ మెట్లుమీదుగానే ప్రధానాలయంలోకి చేరుకుంటారు. నిత్యమూ భక్తులతో రద్దీగా ఉండే గర్భాలయ ప్రాంగణంలో కుడివైపున భక్తతుకారాం పాదుకలున్నాయి. అలాగే గర్భాలయ మంటపంలో వినాయకుడు, లక్ష్మీనారాయణ మూర్తులున్నాయి. గర్భాలయ మండపం 16 స్తంభాలతో నిర్మితమైంది.
గర్భాలయం వెండి ద్వారంమీద స్వామివారి లీలా విశేషాలను తెలిపే అందమైన మూర్తులున్నాయి. గర్భాలయ మండపంలో గరుడ స్తంభం ఉంది. వెండితో చేసిన ఈ స్తంభాన్ని దర్శించుకున్నా, భక్తితో ఆలింగనం చేసుకున్నా పాండురంగస్వామిని ఆలింగనం చేసుకున్న ఫలం లభిస్తుందంటారు. ఇక్కడ స్వామి పాదాలను భక్తులు స్వయంగా తాకి నమస్కరించుకోవచ్చు. శిలారూపుడైన స్వామి ఇక్కడ రెండుచేతులను నడుంమీద పెట్టినట్టుగా దర్శనమిస్తాడు. నిరంతరం పాండురంగస్వామి నామస్మరణతో మారుమ్రోగే ఈ గర్భాలయ శోభవర్ణనాతీతం. పాండురంగని మూలమూర్తికి సమీపంలో రుక్మిణీ మాత మందిరం ఉంది.
మహిళా భక్తులు ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే, ఇదే ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, శ్రీవెంకటేశ్వరుడు, సత్యభామ, రాధికమాత, శనీశ్వరస్వామి, సూర్యనారాయణస్వామి, మహాలక్ష్మి, భక్తతుకారాం, ఆంజనేయస్వామి, నామ్‌దేవ్ తదితర మందిరాలు కూడా దర్శనమిస్తాయి. పండరీపురం క్షేత్రానికి సమీపంలో ఉన్న గోపాలపురంలో జానాబాయి, సక్కుబాయి వాడిన బిందెలు, తిరగలి, కుండలను దర్శించుకోవచ్చు.
పండరీపురం క్షేత్రానికి షోలాపూర్‌కు వరకూ రైలులో వచ్చి అక్కడినుంచి బస్సులో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. షోలాపూర్ నుంచి పండరీపురానికి దూరం 74 కిలోమీటర్లు.


0 comments:
Post a Comment